Thalliki Vandanam: తల్లికి వందనం పై చంద్రబాబు స్పెషల్ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలలో “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకం ఓ ప్రాధాన్యత కలిగినది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలో ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది తల్లులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కోసం ఏకంగా రూ.8745 కోట్లు ఖర్చు చేయడం చూస్తేనే, ప్రభుత్వం దీనిపై ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం అవుతుంది. ప్రతి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉన్నారో, అంతమందికీ లబ్ధి అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా చేరాల్సిన కుటుంబాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
చంద్రబాబు విధానం అనేది ఎప్పుడూ కొలమానం మీదే ఆధారపడుతుంది. ఏ పథకాన్ని తీసుకున్నా, దానిపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకుని, అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఇదే తరహాలో ‘తల్లికి వందనం’ పథకంపై మాతృమూర్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. జూన్ 25వ తేదీ నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులైన తల్లులతో టెలిఫోన్ (IVRS) ద్వారా మాట్లాడి, 12 ముఖ్యమైన ప్రశ్నలను అడిగి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ఈ ప్రశ్నలలో, ప్రభుత్వం అందిస్తున్న డబ్బుతో మీరు ఏమి చేస్తున్నారు? చదువుల కోసం ఖర్చు పెడుతున్నారా? లేక ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారా? ఈ పథకం వల్ల మీ కుటుంబాల్లో ఏవైనా మార్పులు వచ్చాయా? అన్నవన్నీ ఉన్నాయి. ఈ అభిప్రాయాల ఆధారంగా పథకాన్ని మరింత మెరుగుపర్చే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు, ప్రభుత్వ పాపులారిటీకి సంబంధించి వచ్చే ప్రతిఫలాలను కూడా ఈ సమీక్షలో భాగంగా గుర్తిస్తారు.
ఇంకా, జూలై 1 నుంచి 15 వరకు ఈ పథకానికి సంబంధించిన విషయాలపై పోటీలు కూడా నిర్వహించబోతున్నారు. వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, కవితలు, చిత్రలేఖనం మొదలైన వాటిలో విద్యార్థులు, తల్లులు పాల్గొననున్నారు. ఈ పోటీలలో స్కూల్స్ పేరెంట్ కమిటీలు కూడా భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విధంగా ‘తల్లికి వందనం’ పథకం గురించి ప్రజల్లో చైతన్యం పెంచేలా, ప్రభుత్వం దీన్ని ప్రజలతో సంబంధం కలిగి ఉన్న స్థాయిలో కొనసాగించే వ్యూహాన్ని రూపొందించింది. ఇది కేవలం ఓ పథకం కాదు, తల్లుల గౌరవాన్ని, వారి పాత్రను గుర్తించే ఉద్యమంగా మారుతోంది. చంద్రబాబు తన హామీలను ఎంతో జాగ్రత్తగా అమలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల వేటజీపై కూడా దృష్టి పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.