రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు : చంద్రబాబు
బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధి పనులపై పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణకు రూ.166 కోట్లు అవసరమవుతాయాని అంచనా వేశారు. ఇందుకోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. రాజధానిలో 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. రాజధానిలో థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మాణం, ప్రైవేట్ సంస్థల నిర్వహణలో మాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడాదిలో 38 వేల కుటుంబాలు ఇక్కడి వస్తాయని, ముందు ముందు రాజధానిలో జనాభా పెరుగుతుందని తెలిపారు. మరోవైపు రాజధానిలో ప్రధాన రహదారుల వెంట కంటైనర్ హోటళ్ల ఏర్పాటుకు ఫార్య్సూన్, షెరటాన్ సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు మంజూరు అయ్యాయని, ఇప్పటికే 187 క్యాంటీన్లకు స్థలాలు గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందులో 39 స్థలాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అన్న క్యాంట్లీ ఏర్పాటుపై ఏజెన్సీల సంసిద్ధతను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇకపై వారం వారం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పురోగతిపై సమీక్షిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.













