బనగానపల్లి అసెంబ్లీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అభివృద్ధి చేసేవాళ్లను, పార్టీని ప్రజలు మరిచిపోరు. అభివృద్ధి ఎప్పటికైనా అక్కరకు వస్తుంది. అభివృద్ది చేస్తామనే నమ్మకమే టిడిపిమీద ప్రజల్లో ఉంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం. అది చూసే కొత్తరాష్ట్రం నిర్మాణం మనం మాత్రమే చేయగలమని 2014లో గెలిపించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టిడిపియే రావాలని ఇప్పుడు ప్రజలు మనకే ఓట్లేశారు.
గతంలో పార్టీ గమ, మండల, నియోజకవర్గ కమిటిలుగా ఉండేది. ఇప్పుడు బూత్, ఏరియా వారీగా కమిటిలను విస్తృతం చేశాం. బూత్ కమిటి ఉన్నచోట, లేనిచోట తేడా స్పష్టంగా కనిపించింది. సంస్థాగతంగా బలాన్ని కాపాడుకుంటేనే కొత్తబలాన్ని పార్టీ పెంచుకోవాలి. ఈ సారి మన పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది, ముందు మాదిరిగా ఉండదు. కఠినంగా వ్యవహరిస్తాను, సుస్థిరమైన చర్యలు తీసుకుంటాను. కార్యకర్తలు ఎవరికీ బెదిరిపోవాల్సిన పనిలేదు. ప్రత్యర్ధులకు భయపడాల్సిన పనే ఉండదు. ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటాను.
భయం అనేది తెలుగుదేశం రక్తంలోనే లేదు. మనం ఏ తప్పు చేయం, ఎవరికీ భయపడం. ఘర్షణలు వద్దని, గొడవలకు వెళ్లవద్దని గతంలో మీకు చెప్పాను. మిమ్మల్ని కంట్రోల్ చేద్దామని అనుకున్నాను. అదిచూసి ప్రత్యర్ధులు రెచ్చిపోయారు, ఇకపై అలా ఉండదు. ఫాక్షన్ పూర్తిగా కట్టడి చేయడంపైనే నా దృష్టి పెడతాను. సీమ గడ్డనుంచి ముఠాకక్షలు సమూలంగా పోవాలి. అభివృద్ధి,సంక్షేమమే అందరి అజెండా కావాలి. గ్రూపు రాజకీయాలకు కాలం చెల్లింది, ముఠా కక్షలకు కాలం చెల్లింది. ప్రజలతో మంచిగా ఉండాలి, అభివృద్ధి రాజకీయాలు చేయాలి.













