సంక్షేమం లో మనమే ఫస్ట్
సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆగ్రగామిగా ఉందని, సంక్షేమ పథకాల సమాచారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగం గ్రామదర్శిని కార్యక్రమం కోసం తగిన సమాచారంతో సిద్ధం కావాలన్నారు. గిరిజనులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయనన్ని పథకాలు ప్రస్తుతం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి గిరిజనుల సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యం గతంలో మరెవరూ ఇవ్వలేదన్నారు. కాపు భవనాలు అన్నీ ఒకే ప్రాంతాల్లో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని సృష్టం చేశారు. చంద్రన్న పెళ్లికానుక పథకం అమల్లో వివాహ సర్టిఫికెట్ అంశంపై మాట్లాడుతూ వివాహ సర్టిఫికేట్ లేని వారికి కూడా చంద్రన్న పెళ్లికానుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వచ్చే నెలలో నిర్వహించే ఆదివాసీ ఉత్పవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.













