ఎన్నికలు రావని తెలిసే డ్రామాలు : చంద్రబాబు
వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడాదిలోపైతే ఎన్నికలురావన్న ఉద్దేశ్యంతోనే ఈ రాజీనామా పర్వానికి తెరలేపారని విమర్శించారు. బీజేపీతో లాలూచీపడి ఇక్కడి ప్రజలను మోసం చేసందుకు ఈ రాజీనామా కథ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. 2015లో రాజీనామా చేస్తామని ప్రకటించారని, 2016లో, 2017లో కూడా చెప్పినప్పటికీ రాజీనామాలు చేయలేదన్నారు. అలాగే 2018 ఏప్రిల్ 3న రాజీనామా పత్రాలు అందించినప్పటికీ ఆమోదింప జేసుకోకుండా వేచివున్నారన్నారు. అందుకు కారణం అప్పట్లో రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశ్యంతోనే బీజేపీతో కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏకు మద్దతు ఇవ్వడం జరిగిందని అప్పటి నుంచే బీజేపీతో కుమ్మకైయాన్నారన్నారు. నేరస్తులు పీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారంటే ప్రజలు ఏం సంకేతాలు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.













