రేవంత్ సీఎం కావడం ‘బాబు’కు బూస్టా..?
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. తమ అభీష్టం మేరకు.. కాంగ్రెస్ కు పగ్గాలు అప్పజెప్పారు. రేవంత్ సీఎం కావడంతో.. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. కొందరు సంబరాలు చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఏపీలో ఎందుకు సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎందుకు ఆనందం కనిపిస్తోంది. వీరికి రేవంత్ సీఎం అయితే ఏంటి లాభం..?
2017లో కాంగ్రెస్ లో చేరేవరకూ రేవంత్ రెడ్డి…. టీడీపీలో యాక్టివ్ మెంబర్. రేవంత్ అనే కాదు.. సాక్షాత్తూ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. టీడీపీ నుంచి వచ్చినవారే. ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో పలువురు టీడీపీ నుంచే ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే రేవంత్.. టీడీపీలో వేగంగా ఎదిగారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి… నమ్మిన వ్యక్తిగా వ్యవహరించారు. చంద్రబాబు సలహా, సూచనలతో కార్యక్రమాలు అమలు చేస్తూ… విశ్వసనీయమైన వ్యక్తిగా మారారు. దీంతో రేవంత్.. చంద్రబాబుది గురు, శిష్యుల సంబంధం అని కొందరు అంటారు. అయితే రేవంత్ రాజకీయ అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారని మరికొందరు చెబుతారు. ఏదేమైనా.. రేవంత్ కు చంద్రబాబు అంటే అభిమానముందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు కూడా.
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈసారి చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యం ఉన్న రేవంత్ రెడ్డి… సీఎంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు రాజకీయంగా ఆసరా దొరుకుతుందంటున్నారు టీడీపీ కార్యకర్తలు నేతలు. గతంలో సీఎం జగన్, కేసీఆర్ కలిసి.. చంద్రబాబును దెబ్బకొట్టారని, ఇప్పుడు కేసీఆర్ లేకుండా జగన్ తో నేరుగా ఫైట్ చేసే అవకాశం దక్కిందంటున్నారు. దీంతో రేవంత్ సహకారంతో చంద్రబాబు .. ఆంధ్రలో గెలిచే అవకాశముంటుందని చెబుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి చాలా విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడతారు. వ్యవహరిస్తారు కూడా. చంద్రబాబు ఏపీ సీఎంగా గెలిస్తే… ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించే వీలు కలుగుతుందంటున్నారు. దీంతో ఇరు రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో పనిచేసే సౌలభ్యం ఉంటుందని.. ఫలితంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశంఉందని చెబుతున్నారు ఆంధ్ర టీడీపీ నేతలు.













