బాబు పౌరుషం చూపించమన్నారు.. చూపించేశారు..!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. వైసీపీ సునామీ సృష్టించింది. ప్రతిపక్ష టీడీపీ కానీ, విపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఒక విధంగా ఈ ఎన్నికలను అటు ప్రభుత్వానికి, ఇటు విపక్షాల ఆరోపణలకు రెఫరండంలాగా భావించవచ్చు. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావితం చూపిస్తుందని అందరూ భావించారు. అయితే అసలు అవి ఇష్యూలే కాదని తేల్చేశారు ప్రజలు.
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. అటు అమరావతి ప్రాంత రైతులు కూడా సంవత్సరం పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వైజాగ్, కర్నూలు ప్రజలు తమ ప్రాంతంలో రాజధాని వస్తే స్వాగతిస్తారని.. అమరావతి ప్రజలు మాత్రం ఈసారి వైసీపీకి బుద్ధి చెప్తారని అందరూ భావించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతికోసం ప్రజలు పౌరుషం చూపించాల్సిన అవసరం ఉందని సూచించారు. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా ప్రచారం చేశారు. ఈ ప్రాంతానికి తాను ఎంతో చేశానని.. అంతర్జాతీయ స్థాయి రాజధానిని తీసుకొచ్చానని చెప్పారు. అయినా ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత లేదన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దారుణంగా ఓడించారన్నారు. అందుకే ఇప్పుడు మరో అవకాశం వచ్చిందని.. ప్రజలు పౌరుషం చూపించాల్సిన సందర్భం వచ్చిందని చెప్పారు. చీము, నెత్తురు, పౌరుషం ఉంటే ఈ ప్రజలు కృతజ్ఞతలు చూపిస్తారన్నారు. అంతేకాదు.. గుంటూరు, విజయవాడల్లో టీడీపీని గెలిపించకపోతే అమరావతిని వైసీపీకి రాసిచ్చేసినట్లేనన్నారు.
కానీ చంద్రబాబు పిలుపును విజయవాడ, గుంటూరు ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. వైసీపీకి ఏకపక్షంగా విజయం కట్టబెట్టారు. అమరావతి అంశాన్ని అసలు పట్టించుకోలేదు. ఇన్నాళ్లూ అమరావతి ప్రాంత వాసులు రాజధాని పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమంతా వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నట్టుగా ఫేక్ అని తేల్చేసినట్లయింది. కొంతమంది విపక్షనేతలు రాజధాని ప్రాంత రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలు మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ఇప్పుడు వారి వాదన నిజమేననిపించేలా రిజల్ట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.













