32 మంది ప్రాణ త్యాగం ఫలితమే విశాఖ ఉక్కు : చంద్రబాబు
ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని.. ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఆనాటి పోరాటంతో స్వయంగా ఇందిరాగాంధీనే దిగివచ్చారని, అన్నిటింకటే విశాఖే మంచిదని ఆ రోజే కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 32 మంది ప్రాణ త్యాగం ఫలితమే విశాఖ ఉక్కు అని, స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇవాళ విశాఖ లేదన్నారు. ఉక్కు పరిశ్రమను సాధించే క్రమంలో చేసిన ప్రాణత్యాగాలకు సీఎం జగన్ విలువ లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
పోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్ ప్లాంట్ లేదని, ఒక్క విశాఖలోనే ఉందన్నారు. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇవాళ రూ.వేల కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైకాపా పాలన ఇవాళ అదే తీరుతో కొనసాగుతోందని విమర్శించారు. అంతటితో ఆగకుండా కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారని ఆరోపించారు. విశాఖ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే అమరావతిని రాజధానిగా ప్రకటించాం. విశాఖ అంటే నాకు ప్రాణం. నేను మెచ్చే నగరం విశాఖనే. ఇక్కడి ప్రజలు మంచివారు. నీతి, నిజాయతీతో ప్రజలుండే ప్రాంతం. శాంతిని కోరుకునే ప్రాంతం విశాఖపట్నం. కాలక్రమేనా దేశంలోని అన్ని ప్రాంతాలకు వారు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. రాష్ట్రానికి విశాఖ ఎప్పటికీ ఆర్థిక రాజధానిగానే ఉంటుందని అని అన్నారు.













