మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే.. దానిని పునరుద్ధరిస్తాం : చంద్రబాబు
ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అల్లూరి జిల్లా అరకులో నిర్వహించిన రా కదలి రా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దావోస్‌కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామన్నారు. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే, వైసీపీ గంజాయిని చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించా. నేను గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలి. సామాజిక న్యాయం చేస్తానని సీఎం గొప్పలు చెబుతున్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తాం అన్నారు. గిరిజనుల కోసం మే 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలి అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనుల స్కాలర్షిప్పులు ఇస్తే, దాన్నీ తీసేశారు. నైపుణ్యం కోసం శిక్ష కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేశారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీది. గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా? సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్ పంపలేదు. స్కూటర్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవల్సిన పరిస్థితి. ఆయన నొక్కే బటన్ ఒకటి. బొక్కే బటన్ ఒకటి. జగన్ దోచేది ఎక్కువ. జనాలకు ఇచ్చేది తక్కువ. విద్యుత్ ఛార్జీలు ఐదు రెట్లు పెంచేశారు అని విమర్శించారు.













