రాష్ట్రాన్ని పాలించే అర్హత ఆ పార్టీకి లేదు : చంద్రబాబు
వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రాన్ని పాలించే అర్హత ఆ పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒంగోలులో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. గత 40 ఏళ్లలో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే, ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని అన్నారు. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఏపీ చరిత్ర టీడీపీ రాకముందు.. వచ్చిన తర్వాత అని చదువుకోవాల్సి ఉంటుందని అన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయడం చేతకాదని, పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని విరోధులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసం పోరాడటం లేదని, ప్రజలకు ఇబ్బందులుంటే నిలదీస్తున్నామని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నూతనోత్సాహంతో ఉండే వాళ్లను ఎంపిక చేస్తామన్నారు. సరైన వ్యక్తులను సరైన స్థానంలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేం అండగా ఉంటామన్నారు. టీడీపీ హయాంలో పెట్టిన అన్న క్యాంటీన్ తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. పోలవరం, విభజన హామీలు ఏమయ్యాయి? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. అది ఏమైంది? గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. నాకు సీఎం పదవి కొత్తకాదు. ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలో వచ్చారు. ఒక్క ఛాన్స్తోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక్కసారే కదా కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదు. అందుకే మంత్రులతో బస్సు యాత్ర పెట్టారు. సామాజిక న్యాయమని గొప్పలు చెబుతూ రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారు? అని మండిపడ్డారు.













