అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.. బాబు సూపర్ పాలసీ..
నాలుగవసారి సీఎం అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి తను అడుగులు ఆచితూచి వేస్తున్నారు. ఈసారి వచ్చిన అధికారం కేవలం ఐదు సంవత్సరాలకి పరిమితం కాకూడదని.. రాబోయే రోజులలో తమ పార్టీ గెలుపును కొనసాగించాలి అనే విధంగా బాబు ఆలోచనలు ఉన్నాయి. అందుకే డే వన్ నుంచి మంచి యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేసుకుని మరి రంగంలోకి దిగారు. ఏ విషయమైనా సరే చేయలేము అనుకున్నప్పుడు మొదట్లోనే చెప్పేస్తే పోతుంది అన్న వైఖరి బాబు ఇప్పుడు కనబరుస్తున్నారు. 2014 ఎన్నికలలో గెలిచిన టిడిపి హామీలు నెరవేర్చడంలో తడబడింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ విజయ డంకా మోగించింది. అందుకే నానుస్తూ పోతే మొదటికే మోసం వస్తుంది అనుకున్న బాబు చేయలేము అనుకున్న పనులను తొలితే స్పష్టంగా చెప్పేస్తున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా బాబు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదట వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర సామాజిక వర్గాలకు అందించే పెన్షన్లు 4000 రూపాయలు పెంచుతూ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి దాన్ని అమలు చేస్తూ జూలైలో బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్లు అందించారు.
దీంతో మిగిలిన పథకాలు కూడా అదే జోరుగా ఆచరిస్తారని అందరూ ఆశించారు. అయితే చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించి అందరికీ షాక్ ఇచ్చారు. అన్ని హామీలు అమలు చేయాలి అంటే బడ్జెట్లో అదనంగా సంవత్సరానికి లక్షల కోట్ల వరకు ఆర్థిక భారం పెరుగుతుంది. అప్పుల కోసం తిప్పలు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఇంత భారం తట్టుకోవడం కష్టం. అందుకే అసెంబ్లీ వేదికగా ప్రజలకు బాబు తన సందేశాన్ని స్పష్టంగా అందించారు. మొదట రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి సూపర్ సిక్స్ విషయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడం వల్ల ముందుకు కదల లేకపోతున్నామని స్పష్టం చేశారు.













