ఆత్మకూరు ఉప ఎన్నికపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉప ఎన్నికలో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేని తెలుగుదేశం పార్టీ విధానమని గుర్తు చేశారు. అందుకే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ నేత చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికపై వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. గతంలో బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో, ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.













