Chandrababu: జనాభా పెరుగుదలపై చంద్రబాబు కీలక అడుగులు..?

దేశంలో తగ్గుతోన్న జనాభా(Population) ఇప్పుడు పాలకులను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పుడు దేశానికి బలంగా ఉన్న జనాభా భవిష్యత్తులో బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దేశాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు(Chandrababu) సర్కార్ నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
3-4 పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. జనాభాను పెంచకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చంద్రబాబు.. ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ ముసాయిదాను విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు, మేధావుల, సూచనలతో ముసాయిదా రెడీ చేస్తోంది రాష్ట్ర సర్కార్. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో పొందుపరుస్తున్నారు.
ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనుంది సర్కార్. అలాగే ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలకు పొడిగించాలని భావిస్తోంది. మూడో బిడ్డ ఉంటే అదనంగా 50 వేలు ప్రోత్సాహకం, నాలుగో బిడ్డకూ ఇదే కొనసాగించాలని ముసాయిదాలో ప్రస్తావించారు. అలాగే పిల్లలు పుట్టేందుకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కూడా కల్పించాలని భావిస్తోంది. కళాశాల విద్యార్ధులకు, ఉద్యోగాలు చేసే వారికి జనాభా పెరుగుదలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.