టార్గెట్ సీమ..
వైసీపీ అడ్డా సీమగడ్డ అని వైసీపీ శ్రేణులు ఎప్పుడు సగర్వంగా చెప్పుకుంటాయి. సీఎం జగన్ అయితే … పక్కాగా సీమబిడ్డను అని సగర్వంగా ప్రకటిస్తుంటారు. అంతేకాదు… గత ఎన్నికల్లో కూడా రాయలసీమలో వైసీపీకి అత్యధిక సీట్లు దక్కాయి. ఇప్పుడే కాదు వైఎస్ హయాంలో కాంగ్రెస్ కూడా సీమలో కంచుఢంకా మోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే వైసీపీ ఎప్పుడూ సీమపై ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తుంది.. ఎందుకంటే రాజకీయంగా బలమైన స్థానం కాబట్టి.
అందుకే చంద్రబాబు… సీమ లెక్కల్ని సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. జగన్ సీమ బిడ్డకాదు.. రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. నదుల అనుసంధానంతో పాటు ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. సీమలో సిరులు పండేవని చెబుతున్నారు.రాయలసీమ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన చంద్రబాబు.. ఎక్కడ, ఏవిధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయో వివరించారు.
రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందన్నారు చంద్రబాబు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం హయాంలో రూ.68,293 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇరిగేషన్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ పక్క ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు అన్యాయం చేస్తూనే.. మరో వైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను రక్షించ లేకపోతున్నారన్నారు. నిర్వహణ సరిగా లేక.. ఇసుక మాఫియాలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయిందని తెలిపారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా 198 ప్రాజెక్టులు.. రాయలసీమలో 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసేశారన్నారు. మరో ఐదేళ్ల వరకు టెండర్లు పిలవొద్దని జీవో జారీ చేస్తారా?… ఇంతటి దారుణానికి పాల్పడిన జగన్ రాయలసీమ ద్రోహి కాదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇప్పుడీ ప్రెజంటేషన్ సీమ జనాలకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సీమలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని.. అందుకే ఎమ్మెల్యేలు సైతం సైకిల్ వైపు చూస్తున్నారంటున్నారు. ఈసారి సీమలో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉండదని… సైకిల్ దూసుకుపోతుందంటున్నారు. మళ్లీ టీడీపీతోనే సీమ అభివృద్ధి ఖాయమంటున్నారు. దీనికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై (CM Jagan) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘పేదలకు పెత్తందార్లుకు పోరాటమా..?, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే పేదలకు మేలు జరిగేది కదా..? స్లోగన్లు వద్దు.. ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క స్లోగన్లు ఇస్తారా..? ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేసి కూడా అనవసరం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణంపై టైమ్ బాండ్ ప్రోగ్రాం పెట్టుకుని పని చేస్తాం. జగన్ కిమ్ బ్రదర్. నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారు. ఇది చెత్త గవర్నమెంట్. బటన్ నొక్కితే అమ్మఒడి వస్తుందా..?, రూ. 13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి రూ. 5 వేలు వేస్తారా..?, జగన్‌ను నొక్కేది ఉత్తుత్తి బటనే. అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతారు.’’ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.













