తన భద్రతపై చంద్రబాబు ఆందోళన.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి ఓ లేఖ రాశారు. తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరి వల్ల తనతో పాటు తన కుటుంబానికి కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. తన వ్యక్తిగత పరువును బజారుకీడ్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 25న ఆయన ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. జైలు అధికారుల ద్వారా లేఖను ఏసీబీ జడ్జికి పంపించారు. అది ఇవాళ జడ్జికి అందింది. గతంలో విచారణ సందర్భంగా ఏదైనా తెలియజేయాలనుకుంటే సీల్డ్ కవర్ ద్వారా తనను నేరుగా సంప్రదించవచ్చని ఏసీబీ జడ్జి చంద్రబాబుకు సూచించారు. జడ్జి సూచన మేరకు చంద్రబాబు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
3 పేజీల లేఖలో తన భద్రత, ఆరోగ్యంపై చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. తాను జైలులోకి అడుగు పెట్టినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీశారని.. ఆ ఫుటేజ్ ను పోలీసులే లీక్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. తన పరువును దెబ్బ తీసేందుకే పోలీసులే ఇలా చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాక.. తనను అంతం చేసేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఓ లేఖ కూడా వచ్చిందని.. దానిపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి విచారణ జరపలేదని చంద్రబాబు తెలియజేశారు. జైలు ప్రాంగణంలోకి కొంతమంది గంజాయి ప్యాకెట్లు విసురుతున్నారని ఆయన లేఖలో ప్రస్తావించారు.
మరోవైపు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎక్కువ మంది డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన ఖైదీలున్నారని చంద్రబాబు తెలిపారు. ఎస్.కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని తన దృష్టికి వచ్చినట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 6న తన కుటుంబసభ్యులు ములాఖత్ కోసం తనను కలవడానికి వచ్చినప్పుడు కూడా మెయిన్ గేట్ వద్ద డ్రోన్ ఎగరేశారన్నారు. దీంతో తన కుటుంబ సభ్యుల భద్రతకు కూడా ముప్పు ఉన్నట్టు అర్థమవుతోందన్నారు.
డ్రోన్లు ఎగరేయడం, చంద్రబాబు జైలులో ఉన్న ఫోటోలు బయటకు రావడంపై టీడీపీ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం, పోలీసులే ఈ పనులు చేస్తున్నారని అనుమానిస్తోంది. అయినా వీటిపై ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నేరుగా జడ్జికి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.













