అధికారులను ఆదేశించే అధికారం సీఎంకు లేదా ?
వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రమే ఎన్నికల కమిషన్ స్పందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని చంద్రబాబు కోరారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను తానెప్పుడూ చూడలేదన్నారు. శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎంకు లేదని.. ఏపీ సీఈవో ద్వివేది చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. పోలవరం, రాజధాని నిర్మాణం, మంచినీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాలపై సీఎం సమీక్షలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ ఛీప్ను సీఎంకు రిపోర్ట్ చేయొద్దనడానికి సీఈవో ఎవరని నిలదీశారు.
సీఎంకు ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చెయ్యకూడదని ఈసీ నిబంధనల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రంలో ఐబీ చీఫ్ ప్రధానమంత్రికి ఎలా రిపోర్ట్ చేస్తారో.. రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంకు అలాగే రిపోర్ట్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని సీఈవోకు ఉత్తర్వులివ్వాలన్నారు. సమీక్షలపై సీఎం అధికారులను ఆపే హక్కు ఈసీకీ లేదన్నారు. ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, ఎండల కారణంగా గత వారంలో ఏడుగురు మరణించారన్నారు. వైపరీత్యాలపై జాగ్రతలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అధికారం సీఎంకు లేదా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలో ఒక రకంగా.. మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరోలా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.













