కుప్పం లాఠీఛార్జ్‌పై చంద్రబాబు ఫైర్.. గాయపడిన కార్యకర్తల పరామర్శ
చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. గొల్లపల్లిలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారికి కుప్పం కేసీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. గురువారం చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. తమ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి దిగజరారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను లాఠీఛార్జ్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. గాయాలతో ఆసుపత్రిపాలైన కార్యకర్తలు భయపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుప్పంకు 1500 మంది పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చిందని, కుప్పం ఏమైనా యుద్ధ భూమా? శత్రుదేశమా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో దాడులు చేసి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది పోలీసులే అని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే శాంతి లేకుండా చేశారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయించిది శాడిస్టు, సైకో సీఎం అని, ఇలాండి దాడులతో తమను బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇటువంటి రౌడీయిజాన్ని అణచివేస్తా అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.













