ఇది తెలుగుదేశం పార్టీ విజయం : చంద్రబాబు
పెనుగొండ నియోజకవర్గంలోని కియా కార్ల పరిశ్రమను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించారు. టీడీపీ హయాంలో వచ్చిన కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ చేశారు. అనంతపురం జిల్లాలో కియా ప్రపంచం సృష్టించామని గుర్తు చేశారు. ఇది తమ విజన్, విధ్వంసం సైకో నైజమని మండిపడ్డారు. కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా? అని ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాపై తనకున్న ప్రేమతోనే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చానని వెల్లడిరచారు. 6 నెలల్లోనే గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీరిచ్చామన్నారు. రాళ్ల సీమలో కియా సిరులు పండిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ విజయమని పేర్కొన్నారు. 10 లక్షల కార్లు ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసిన ఉద్యోగులు జై బాలయ్య పాటకు డ్యాన్స్ చేశారంటే అదీ ఘనత అని తెలిపారు. కియా పరిశ్రమతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచామన్నారు. కియా కార్ల అమ్మకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇక్కడ ఎంపీ బట్టలు విప్పి రోడ్డుపైకి వస్తాడేమోనని తనకే భయం వేస్తోందని ఆక్షేపించారు. కుల, మత, ప్రాంతం పేరుతో ఇష్టానుసారంగా రాజ్యాధికారం చేయనివ్వమని హెచ్చరించారు.













