మోదీ స్థానంలో కొత్త ప్రధాని : చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ స్థానంలో ఈ నెల 23వ తేదీ తర్వాత కొత్త ప్రధాన మంత్రి రానున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటివరకూ బెంగాల్ టైగర్‌గానే పేరుపొందారని, రాబోయే బీజేపీ యేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించి దేశానికే బెబ్బులి అవుతారని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని జార్గ్రామ్, హాల్దియాల్లో జరిగిన బహిరంగ సభల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బెంగాలీ భాషల్లో ప్రసంగించారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, అక్కడ మహనీయుల గొప్పతనం గురించి బెంగాలీలో వివరించారు. అనంతరం ఆంగ్లంలో ప్రసంగించిన చంద్రబాబు మోదీపై తీవ్రంగా ధ్వజమెమత్తారు. మతం ముసుగులో పశ్చిమబెంగాల్లో అడుగుపెట్టాలని చూస్తున్న నరేంద్రమోదీ అమిత్‌షాల ఆటు సాగనివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి చోటివ్వటమంటే మతవిద్వేషాలకు ఆజ్యం పోయటమేనని, జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొస్తామంటూ దేశంలో మరో సంక్షోభం సృష్టించేదుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.













