రివర్స్ టెండరింగ్ కాదు.. అది రిజర్వ్ టెండరింగ్
రివర్స్ టెండరింగ్‌తో రూ.750 కోట్లు మిగిల్చామని వైకాపా నేతలు చెబుతున్నారు, కానీ రూ.7,500 కోట్లు నష్టం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ కాదు, అది రిజర్వ్ టెండరింగ్ అని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నా జీవితాంతం క్రమశిక్షణతో పనిచేశా.. అదే నాకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశా..హార్వర్డ్ వర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికి ఇస్తే దాన్ని చంపేస్తున్నారు. నా పేరు గుర్తుచేసుకుంటారనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు.













