అవినీతి గురించి చెబితే సన్మానిస్తారా?
ప్రాజెక్టుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఇప్పటివరకూ ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోయిందన్నారు. ఊరూరా తిరిగి అవినీతిపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు సన్మానాలు చేస్తామనడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన ఇంటి వద్ద పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ హయాంలో చేపట్టిన పనులన్నీ టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టిందని, కొన్నింటిని పూర్తిచేసి, మరికొన్నింటిని చివరిదశకు చేర్చితే ఇప్పుడు వాటిని ఆపేసి అవినీతి బురద చల్లడం సబబు కాదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో అనేక ప్రాజెక్టులు ప్రారంభించామని, ఏమాత్రం ఆలోచన లేకుండా అవన్నీ రద్దు చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరుంటే పెట్టుబడులు వచ్చేవి. ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు మా పరిస్థితేంటి? అని పలువురు చంద్రబాబు వద్ద ఆవేదన చెందారు. సోమవారం ఆయన నివాసానికి వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి మహిళలు, రైతులు, విద్యార్థులు తరలివచ్చారు.













