అర్జున గ్రహీతకు రూ. కోటి : చంద్రబాబు
విలువిద్యలో అర్జున పురస్కారగ్రహీత వెన్నం జ్యోతిసురేఖకు ప్రోత్సాహకంగా రూ.కోటి అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 70 పతకాలు సాధించిన వెన్నం జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్ పేరును నిలబెట్టిందని, ఆమె ఈ పోటీలలో మరింత రాణించేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో అత్యంత పిన్న వయసులో అర్జున అవార్డు పొందడం, రాష్ట్ర విభజన తరువాత తొలి అర్జున పురస్కార గ్రహీత కూడా అమె కావడం అభినందనీయమని అన్నారు.
క్రీడలకు తామెంతో ప్రాధాన్యాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తున్నది వివరించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా విజేతలకు నిలయంగా మార్చాలన్నదే తన లక్ష్యమని అన్నారు. క్రీడలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కార్యప్రణాళికను రూపొందిచాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా యువజన, క్రీడలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అదేశించారు. క్రీడల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపి మరింత మంది విజేతలను తయారు చేసే లక్ష్యంతో పనిచేయాలని క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు.













