భారత రాయబారులతో సీఎం చంద్రబాబు సమావేశం
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ అభివృద్ధిలో ఎన్నో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఆహారశుద్ధితో పాటు వీటి విలువ పెరిగేలా పలు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలపై వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న భారత రాయబారుల బృందం అమరావతి చేరుకొని సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకులకు లక్ష గదులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి అనంతపురం శ్రీసిటీ ఉత్తమమైన ప్రాంతమని అన్నారు. హార్డ్వేర్ రంగంలో 25 నుంచి 30 శాతం వరకు కార్యకలాపాలు ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రాస్తావించారు. ఈ సమావేశంలో స్పెయిన్ భారత రాయబారి డి.బాల వెంకట వర్మ, ఆస్ట్రేలియా భారత రాయబారి రెనీ పాల్, వియత్నాం భారత రాయబారి పి.హరీష్, కువైట్ భారత రాయబారి కె.జీవసాగర్ తదితరులు పాల్గొన్నారు.













