కోవిడ్ మృతుల వివరాలు చెప్పాల్సిందే : చంద్రబాబు నాయుడు

కోవిడ్ మృతుల పేర్లను వెంటనే ఏపీ ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, వెంటనే లెక్కలు బయటపెట్టాలని అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ‘సాధన దీక్ష’చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కరోనా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా పనిచేసి ఉంటే మాత్రం ఏపీలో ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చి ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. కరోనాతో ప్రపంచం ప్రపంచమే భయపడితే, సీఎం జగన్ మాత్రం అత్యంత తేలిగ్గా తీసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాల్సింది పోయి, పేదలపై ఎక్కువ భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా లాంటి కష్ట కాలంలో ప్రతిపక్షాల సూచనలను కూడా జగన్ సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదని, కనీసం పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు.