రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు విడుదల
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. తమ అధినేత విడుదల కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. నారా లోకేశ్, బ్రాహ్మణి, దేనాన్ష్, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి. జనార్ధన్ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.













