Kondapalli Srinivas: నోటితో కాదు పని తీరుతో సమాధానం ఇచ్చిన ఏపీ మంత్రి…!
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రుల విషయంలో దాదాపు రెండు మూడు నెలల నుంచి.. సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సందడి ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది కీలక మంత్రుల విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సీరియస్ గా ఉన్నారనే ప్రచారం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) ను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ ను కూడా క్యాబినెట్ నుంచి బయటకు పంపించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇక సోషల్ మీడియా విషయంలో కూడా కొండపల్లి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు దాదాపు 20 రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా క్యాబినెట్ సమావేశం సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో మంత్రి వేగంగా పనిచేస్తున్నారని..
అలాగే సచివాలయంలో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారని, నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ ను స్వయంగా చంద్రబాబు నాయుడు పొగడటం గమనార్హం. తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే ఏమాత్రం కంగారు పడకుండా శాఖలపై పట్టు పెంచుకుంటున్నారని, ఇది ఇలాగే కొనసాగాలని మంత్రికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై టిడిపి క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక మంత్రిని ముందు టార్గెట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొగడ్డం మొదలుపెట్టారు.
మృదు స్వభావిగా పేరు ఉన్న కొండపల్లి శ్రీనివాస్ మీడియాలో కూడా ఎక్కువగా కనబడే ప్రయత్నం చేయరు. రాజకీయ విమర్శలకు కూడా ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ మధ్యకాలంలో ఎక్కడా కనపడలేదు. ఇతర మంత్రుల మాదిరిగా ఆయనలో.. వ్యక్తిగత దూకుడు కూడా తక్కువే. కేవలం పనితీరుపై మాత్రమే మంత్రి ఆధారపడతారని ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళు చెబుతూ ఉంటారు. దీన్ని మంత్రి రుజువు చేసుకున్నారు. ఇక తనపై విమర్శలు చేసిన వాళ్లను విమర్శలతో కాకుండా పనితీరుతో ఆయన సమాధానం చెప్పడం గమనార్హం.













