వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ .. మరో 52 రోజుల తర్వాత : చంద్రబాబు
అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లులో నిర్వహించి రా కదలిరా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారు. టీడీపీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? మనం చట్ట ప్రకారం వెళ్తున్నాం, అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైందన్నారు.
పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులపై వైసీపీ నేతలు కేసులు పెట్టింటి వేధించారు. మైనింగ్ అధికారులు వైసీపీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదించారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరు మీద పడ్డారు. గొట్టిపాటి రవికుమార్‌కు 3. వేల కోట్ల జరిమానా విధించారు. చివరకు నేను పవన్ కల్యాణ్ కూడా వైసీపీ బాధితులమే. మాట్లాడితే జగన్ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. చెత్త, నీరు ఆస్తిపై పన్నులు పెంచారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్‌పై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు. జగన్ పెట్టే ప్రతి స్కిమ్ వెనుక స్కామ్ ఉంటుంది. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదన్నారు. అమరావతి రాజధాని అని అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారు.ఆనాడు బీజేపీతో విభేదించింది ప్రజల కోసం, రాష్ట్ర కోసమే. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్ర సాయం చేస్తామన్నా, తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అన్నారు.













