పోలీసులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి : చంద్రబాబు
రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రఘురామను కొట్టినందుకు సీబీఐ విచారణ ఎదుర్కుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను నమ్ముకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని అన్నారు. మూడేళ్ల తర్వాత మీ వెనుక ఎవరోస్తారో నేను చూస్తా. 22 ఏళ్లు అధికారంలో ఉన్న మేము ఇలాగే చేశామా? మీరు బాధపడే రోజూ దగ్గర్లోనే ఉంది అని అన్నారు.
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్‌రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించారన్నారు. జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని నిలదీశారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. జనార్దన్‌రెడ్డి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని, జగన్ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమ కేసులు •నాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొత్త రాజకీయాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు.













