వారి హత్యకు కుట్ర జరుగుతోంది : చంద్రబాబు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కడప జైలులో ప్రాణహాని ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడ పటమటలోని తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వారి హత్యకు కుట్ర జరుగుతోందదన్నారు మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్ రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారన్నారు. కడప జైలర్‌గా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వారికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఎక్కడ అన్యాయం జరిగినా పరిష్కారం కోసం టీడీపీ ముందుంటుందన్నారు.
ఎమ్మెల్సీ అశోక్‌బాబును అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారన్నారు. 33 మంది టీడీపీ నేతలకు హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ప్రతిఒక్కరి పక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు. తప్ప చేసే ప్రతి అధికారీ తప్పించుకోలేరని హెచ్చరించారు.