ఎవరైనా మూడు రాజధానులు కావాలని అడిగారా?
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ది ఆగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రజాచైతన్య యాత్రను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది. ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వైకాపాకు ఓటు వేశారని ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. చీటికి మాటికి టీడీపీ కార్యాకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. నేను అలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా? రేషన్, ఫించన్, అన్నింటిలో కోతలు వేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రం నుంచి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. రిలయన్స్, అదానీ, లూలూ సంస్థలు ఎందుకు పోయాయి? కియాను బెదిరిస్తే వాళ్లు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. పెట్టుబడులు రాకుండా
ఉద్యోగాలు లేకపోతే స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు ఎందుకు? 75 శాతం రిజర్వేషన్ల మూలంగా పక్క రాష్ట్రాలకు వెళితే సొంత రాష్ట్రానికే పొమ్మంటున్నారు. అమరావతి, పోలవరాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎవరైనా మూడు రాజధానులు కావాలని అడిగారా? అమరావతిపై ఎందుకంత కక్ష? 29 వేల మంది రైతులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు.
జే ట్యాక్స్ కడితేనే మద్యం వస్తుంది. లేకపోతే రాదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నిజాయతీతో ఉన్నా. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. నా కుటుంబ కోసం, నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు. డబ్బుకు లొంగి కేసులకు భయపడితే ప్రజలకు భవిష్యత్తు ఉండదు. టీడీపీ నేతల భద్రతను తొలగిస్తున్నారు. నా భద్రతను కుదించే యత్నం చేస్తున్నారు. నా భద్రత తొలగించినా ఇబ్బంది లేదు. నన్ను ప్రజలే కాపాడుకుంటారు అని చంద్రబాబు అన్నారు.













