ఓ ట్రాక్టర్..ఓ సోనూసూద్… ఓ చంద్రబాబు ఇదీ స్టోరీ
చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావు ఆయన ఇద్దరు కూతుర్లు.. మొత్తంగా ఆయన కుటుంబం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీడియాకు కేంద్ర బిందువుగా మారారు. కూతుర్లతో కలిసి పొలం దున్నిన నాగేశ్వరరావు ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో అధికార విపక్ష పార్టీలను సైతం ఒక కుదుపు కుదిపింది. వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు కొద్దిగా పొలం ఉంది. ఎద్దులు, ట్రాక్టర్ లేకపోవడంతో ఆయన కొన్ని రోజుల క్రితం కూతుర్లతో కలిసి పొలం దున్నాడు. ఈ వైనాన్ని కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ఆ వీడియో అలా అలా ఎలక్ట్రానిక్ మీడియాకు ఆ తర్వాత తర్వాత సోషల్ మీడియాకు వెళ్లిపోయింది. వైరల్ అయిపోయింది. మీడియా కధనాలు చూసిన అరుంధతి విలన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ శరవేగంగా స్పందించారు. గంటల వ్యవధిలోనే ట్రాక్టర్‌ను కొని రైతు నాగేశ్వర్రావుకు పంపించేశారు. ఇప్పటికే లాక్ డవున్ టైమ్‌లో వలస కూలీలకు చేసిన సేవల ద్వారా విపరీతమైన మీడియా అటెక్షన్ అందుకున్న సోనూసూద్…ఈ ఉదంతంతో మరోసారి మీడియాకు కేంద్రబిందువుగా మారారు. సోనూసూద్‌ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెళ్లువెత్తాయి. ప్రచారం విషయంలో వెనుకబడకూడదనుకున్నారో, ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించేందుకు ఇదే అదను అనుకున్నారో గాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలొకి దిగారు.
సోనూసూద్‌ని అభినందిచడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని, ఆ రైతు ఇద్దరు కూతుర్లను తాను చదివిస్తానంటూ ప్రకటించేశారు. దీంతో సహజంగానే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ అమలు చేస్తున్న పధకాలు ఎన్నో ఉంటే…రైతుల పరిస్థితి ఎందుకింత దయనీయంగా ఉందంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశః పార్టీ అభిమానులు విరుచుకుపడడం ప్రారంభించారు. దీంతో జగన్ సర్కార్ అలర్టయింది. ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. రైతు వివరాలన్నీ తెలుసుకున్నారు. రైతు నాగేశ్వరరావు మరీ నిరుపేద ఏమీ కాదని, అతను గతంలో లోక్ సత్తా తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ కూడా చేశాడని తేల్చారు. కరోనా లాక్ డౌన్ వలన మదనపల్లి లో తనకున్న టీ వ్యాపారం లేదు కనుక ఇప్పుడు తన సొంత ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడని వీరు వెల్లడించారు. అంతేకాదు ప్రభుత్వం ద్వారా అతనికి అందిన పధకాల లబ్ధి మొత్తం ఏకరవు పెట్టారు. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో పడిందని, అలాగే ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో పడనుందని, ఇక నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 ప్రభుత్వం అందించిందని, చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం అందించే వడ్డీలేని ఆర్థిక సహాయం పధకం జగనన్న తోడు కింద లబ్ధికోసం పెద్ద కూతురు దరఖాస్తు చేశారని వెల్లడించారు. అలాగే నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోందని, నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారని తేల్చారు. అంతేకాకుండా కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని కూడా నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుందని వివరించారు. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు అంటూ ప్రభుత్వాధికారులు వెల్లడించడంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఊపందుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీల పరస్పర పోరుతో నాగేశ్వరరావు స్థితిగతుల మీద రకరకాల వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. దీంతో తాను ట్రాక్టర్ తిరిగి ఇచ్చేస్తానని నాగేశ్వరరావు అన్నాడంటూ కధనాలు వచ్చాయి. మరోవైపు దళితుడైన నాగేశ్వరరావు మీద ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ తెలుగుదేశఃం అనుకూల వర్గాలు మరో రకమైన ప్రచారం మొదలుపెట్టాయి. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఏదేమైతేనేం.. సోనూసూద్ మంచి మనసుతో చేసిన సాయం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల పాటు జనం వర్గాలుగా విడిపోయి గొడవపడేందుకు కారణంగా మారిందనే చెప్పాలి.













