రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత : చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. రాధాపై జరిగిన రెక్కీ విషయంలో సమగ్ర విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని ఆక్షేపించారు. హింస్మాతక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. నేరస్థులపై సమగ్ర విచారణ, కఠినమైన చర్యలే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని అన్నారు.













