అందుకు ప్రధాన కారణం.. బీఎస్ రావు చేసిన కృషి : చంద్రబాబు
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా.బీఎస్ రావు భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీ విషయంలో భారత్ ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికిన వ్యక్తి బీఎస్ రావు అని కొనియాడారు. 1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఐఐటీలు సందర్శించేవాడిని. అప్పుడు ఐఐటీ రామయ్య గురించి తెలుసుకన్నా. ఆయన 100 మందికి కోచింగ్ ఇచ్చి వారందరికీ ఐఐటీలో సీటు వచ్చేలా చేసేవారు. అప్పుడు చైతన్య, నారాయణ సంస్థలకు చెందిన వారిని పిలిపించి, ఐఐటీల్లో ప్రవేశాల విషయంలో శ్రద్దపెట్టాలని అలా చేస్తే పెద్ద ఎత్తున మనకు ఐఐటీ సీట్లు వస్తాయని సూచించా. అప్పుడు 1 లేదా 2 శాతంగా ఉన్న సీట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటీల్లో సీట్లు సాధించే వారు 25 శాతానికి చేరుకున్నారు. అందుకు ప్రధాన కారణం బీఎస్ రావు చేసిన కృషి అని తెలిపారు.













