గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విజయవాడలోని ఒక హోటల్లో సుమారు రెండున్నర గంటలపాటు సమావేశం జరిగింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక తొలిసారి వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగడం గమనార్హం. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పాలనా వ్యవహారాలు, వర్షాల ప్రభావం తదితర పలు అంశాలు చర్చకు వచ్చాయి. గవర్నరు రాష్ట్ర పర్యటనకు వచ్చి విజయవాడలోని హోటల్లో బస చేశారు. దీంతో ముఖ్యమంత్రి వెళ్లి ఆయన కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జాప్ఞికలతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ ముఖూముఖి సమావేశమయ్యారు. సమావేశం తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్లా. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై వివరించా. కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందీ తెలియజేశా. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాల సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరా. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం చర్చకు రాలేదని ముఖ్యమంత్రి తెలిపారు.













