ఏపీ రాజకీయాల్లో సంచలనం..! పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వీళ్లిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికలకు ముందు వరకూ కలిసి పని చేసిన టీడీపీ, జనసేన ఆ తర్వాత విడిపోయాయి. జనసేన బీజేపీతో కలిసి వెళ్లింది. దీంతో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ కావడం రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది.
విశాఖలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకుని హోటల్ కే పరిమితం చేయడం.. జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకోవడం లాంటి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. విశాఖ గర్జన రోజే పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించారు. అయితే పవన్ కల్యాణ్ ను పోలీసులు పూర్తిగా హోటల్ కే పరిమితం చేశారు. అంతేకాక.. ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రుల కాన్వాయ్ పై దాడులు జరగడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ ను బందీ చేయడంతో బీజేపీ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారు. స్థానిక బీజేపీ నేతలు వెంటనే హోటల్ కు వెళ్లి పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు.
పవన్ కల్యాణ్ విశాఖ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత బీజేపీ నేత సోము వీర్రాజు వెళ్లి కలిసి సంఘీభావం తెలిపారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని సోము విర్రాజు అభిప్రాయడ్డారు. మరోవైపు ఇవాళ పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సన్నాసుల్లారా.. నా కొడకల్లారా.. ఎదవల్లారా… అంటూ బూతులు తిట్టే వైసీపీ నేతలపై మండిపడ్డారు. అంతేకాక బీజేపీతో పొత్తుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో పోరాటానికి బీజేపీ కలిసి రావట్లేదని పరోక్షంగా వెల్లడించారు.
పవన్ హాట్ కామెంట్స్ పై ఓ వైపు చర్చ జరుగుతున్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్లో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. విశాఖ పరిణామాలపైనే చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. పవన్ విశాఖలో ఉన్నప్పుడే చంద్రబాబు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఇద్దరు నేతలు విజయవాడలోనే ఉన్నారు. దీంతో నేరుగా నోవాటెల్ కు వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు చంద్రబాబు. ఒకవైపు బీజేపీకి జనసేనకు మధ్య దూరం పెరుగుతోంది. మరోవైపు టీడీపీకి జనసేన దగ్గర కావడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.













