ఎవరు అడ్డుకున్నా ఏపీ అభివృద్ధి ఆగదు : చంద్రబాబు
ఎవరు అడ్డుకున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో సెల్కాన్ చరవాణి యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో ఈ యూనిట్ నెలకొల్పారు. ఈ సందర్భంగా యూనిట్లో తయారైన తొలి ఫోన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ సంస్థలకు తిరుపతి కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని అన్నారు. ఇక్కడ పుట్టిన వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇక్కడే పరిశ్రమ పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ మానుఫ్యాక్చరింగ్ రంగానికి నిలయంగా మారాలి. ఇక్కడ సెల్‌ఫోన్ కంపెనీ వస్తుందంటే ఎవరూ నమ్మలేదు. దీని సాధించి చూపించాం. తిరుపతికి దేశ విదేశాలకు చెందిన ఎన్నో విద్యాసంస్థలు వస్తున్నాయి. ఈ నగరం త్వరలోనే ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తాం అని అన్నారు.













