అమెరికన్ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి అమెరికన్ ఆస్పత్రి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో 20 ఎకరాల స్థలంలో ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రవాసాంధ్రులు ముందుకువచ్చారు. రూ.600 కోట్ల పెట్టుబడితో 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా దీన్ని నిర్మించనున్నారు. 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తికానుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని, ఆ సమయంలో అంతా బాధపడ్డామన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచంలోనే ఆధునిక రాజదాని నిర్మించాలని తాము సంకల్పించామన్నారు. అమరావతికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయని తెలిపారు. అమరావతిలో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.













