ఓటేసే అవకాశమే లేకపోతే… ప్రశ్నించే అవకాశం వస్తుందా?
వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని, ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే, జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశారని చంద్రబాబు ఆక్షేపించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైకాపా నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా? అని ప్రశ్నించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.













