అందరి లెక్కలు రాస్తున్నాం… తిరిగి చెల్లిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందన్నారు. పార్టీకార్యకర్తలే టీడీపీకి అండ అని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాలంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోబెడితే వెనక్కి తీసుకెళ్తారని, ఇప్పుడు జగన్ పాలన కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.
పన్నులు, ఛార్జీలు పేరుతో రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారు. దుర్మార్గపు పాలన నశించాలి, రివర్స్ పాలన పోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి ఇంటి నుంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు, పోలీసులకు సమస్యలు వస్తే మాట్లాడేది టీడీపీనే. ఆ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క పోలీసుల నిధులే కాదు, అందరి బకాయిలు విడుద చేయ్యాలని డిమాండ్ చేశారు. అందరి లెక్కలు రాస్తున్నాం.. వేధింపులకు తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.













