వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు : చంద్రబాబు
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి పూర్వవైభవం రావాలనే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కొత్తపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జగన్ మాట్లాడుతూ నన్ను పశుపతి అని విమర్శించారు. దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. అందుకే నేను శివుడి అవతారమెత్తాను. విషాన్ని గొంతులో పెట్టుకొని శివుడు ప్రపంచాన్ని కాపాడితే నన్ను, నా కుటుంబాన్ని, పవన్ కల్యాణ్‌ను ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించాం. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? కానీ, ఇప్పుడు రాష్ట్రమంతా ఎక్కడా చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు అక్రమ అరెస్టులే జరుగుతున్నాయి. మద్యం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు. ఆ పని చేశారా? మద్య నిషేధం చేయకపోతే వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. బాబాయ్‌ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్.అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. వాలంటీర్లంతా తటస్థంగా ఉండాలి. వారికి న్యాయం చేస్తాం అని అన్నారు.













