చంద్రబాబు హెచ్చరిక… పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా
నంద్యాలలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీలోని ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సీనియర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ శ్రేణులు చొరబడి పురిగొలిపే ఘటనలు ఉంటున్నాయని, అలాంటి వాటిపల్ల అప్రమత్తంగా ఉంటూ పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నంద్యాల నియోజకవర్గంలోనికి నారా లోకేశ్ ప్రవేశించిన నేపథ్యంలో కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఎ.వి.సుబాబ్బరెడ్డి వర్గాలు స్వాగత ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఎ.వి.సుబ్బారెడ్డిని అఖిలప్రియ వర్గీయుడు కొట్టడం, ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.













