ఏపీ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి కిదాంబి శ్రీకాంత్
షిటిల్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ వారం రోజుల్లో రెండు చాంపియన్ షిప్‌లు గెలిచిన వ్యక్తి అని, ఇప్పటివరకు నాలుగు చాంపియన్‌షిప్‌లలో విజయం సాధించాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడ తుమ్మపల్లి కళాక్షేత్రంలో ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ సన్మానసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విదేశాల నుంచి తెచ్చిన షటీల్ బ్యాట్‌ను శ్రీకాంత్ బహుమతిగా అందించారు. ఆ బ్యాట్‌తో సభా వేదికపై ముఖ్యమంత్రి, శ్రీకాంత్‌లు షటీల్ ఆడి ఆహుతులను ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి కిదాంబి శ్రీకాంత్ అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోటీలలో ఇప్పటికే శ్రీకాంత్ నాలుగు సిరీసులను గెలిచారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు పారితోషికాన్ని, అమరావతి రాజధాని ప్రాంతంలో 1000 గజాల స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ అయిల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌కి రాష్ట్రంలో గ్రూప్1 కేడర్ ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం తరపున శ్రీకాంత్ ఆడతారని అందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందన్నారు.













