మోదీ కాచుకో…అంటున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివక్ష చూపిస్తున్నారంటూ, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు రాజ్యాంగసంస్థలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పావులను కదుపుతూ, మోదీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే రెండుసార్లు ఢిల్లీలో పర్యటించి బిజెపియేతర పక్షాలను కూటమిగా ఏర్పరచి మోదీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80, 90వ దశకంలో నందమూరి తారక రామారావు చూపించినట్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మరోసారి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుతున్నారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. తన ఢిల్లి పర్యటనలో ఫ్రంట్ కార్యాచరణకు ఆయన నడుంబిగించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ రాజకీయాల్లో ఉద్ధండులైన శరద్‌పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్, ఏచూరి, మాయావతి, మమతాబెనర్జీలతో ప్రత్యేకంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. దేశాన్ని రక్షించుకుందాం.. కలిసి రండి అంటూ విపక్ష పార్టీలకు పిలుపునిచ్చి కాషాయపార్టీలో చంద్రబాబు ప్రకంపనలు సృష్టించారు.
మరోవైపు కేసీఆర్‌కు కూడా తన పర్యటన ద్వారా చెక్ పెట్టారు. ఇప్పుడు దేశంలో రెండే కూటములు ఉన్నాయని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ కూటమి వైపు ఉంటారన్నది ఆయన్నే అడగాలని చంద్రబాబు విలేఖరులతో వ్యాఖ్యానించి కేసీఆర్‌ను ఇరుకునపెట్టారు. ఆయన బిజెపివైపు ఉంటారా లేక ఫ్రంట్ వైపు ఉంటారా అన్నది ఆయన తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
సమైక్యత వేదికకు బాటలు
తన ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్షాల సమైక్యతకు వేదికను సష్టించటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆయా పార్టీలను సమైక్యపరచటంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌తోపాటు వామపక్షాలతోనూ చర్చలు జరిపి, అందరినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సమైక్య పరిచేందుకు శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నించినా అవి ఆశించిన ఫలితాలను సాధించలేదు. ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పావులు కదిపారు. కానీ, ఆ ప్రయత్నం కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. అయితే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యంతో ప్రతిపక్షాలను కలిపి ఢిల్లీలో సంచలనాన్ని సృష్టించారు.
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ప్రకటన చేయడం జాతీయ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ఆయన ప్రయత్నాల మూలంగా బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఇంతకాలం రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడకపోవటం తెలిసిందే. అయితే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల మూలంగా వారు కూడా ఇతర ప్రతిపక్షాలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ లేకుండా ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి రావటం సాధ్యం కాదంటూ చంద్రబాబు చేస్తున్న వాదనతో మాయావతి, మమతా బెనర్జీ ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల్లో మాయావతి, మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ఆయన గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మాయావతితో చర్చలు జరపటం తెలిసిందే. త్వరలోనే మరోసారి ఈ నాయకులతో చర్చించిన అనంతరం వచ్చే వారం, పది రోజుల్లో ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఈ కీలక సమావేశం ప్రాతిపదిక అవుతుందని అంటున్నారు. గతంలో మాదిరిగానే చంద్రబాబు తాజా ప్రతిపక్ష కూటమికి జాతీయ స్థాయి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.













