ఆ పరిశ్రమను వెంటనే మూసేయాలి : చంద్రబాబు
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను వెంటనే మూసివేయాలని, అవసరమైతే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై తూతూ మంత్రంగా దర్యాప్తు చేయడం సరికాదని, ఆయా రంగాల్లో నిపుణులు మాత్రమే విచారణ చేయాలన్నారు. కంపెనీపై సాధారణ కేసులు మాత్రమే పెట్టారని విమర్శించారు. బాధితులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్యాస్‌లీక్ ప్రమాదంపై ఇప్పటికే హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ, ఎన్జీటీ సుమోటోగా తీసుకున్నాయి అని తెలిపారు.
కేంద్రంతో మాట్లాడి ఇలాంటి పరిశ్రమల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలి. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండటం సరికాదు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించాలి. ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకునేలా సీఎం ప్రకటన ఉంది. గ్యాస్ లీక్ ఘటనపై సమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా. గాలి స్వచ్ఛతపై అధ్యయనం చేయాలి. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే విశాఖ వెళ్లి బాధితులను పరామర్శిస్తా. ధైర్యంగా ఉండాలని విశాఖ ప్రజలను కోరుతున్నా అని చంద్రబాబు వివరించారు. గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.













