ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రాక నేడు…
ఏమైతేనేం… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వరాష్ట్రానికి వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం వెంటనే అనుమతించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఒక రోజు మొత్తం సస్పెన్స్ నడిచిన తర్వాత ఎట్టకేలకు ఎపీ డిజీపీ సైతం అనుమతించడంతో తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఆయన విశాఖ వెళ్లేందుకు ఏపీ డీజీపీ నుంచి ఆదివారం సాయంత్రం అనుమతి లభించింది.
చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం చేరుకుంటారు. అక్కడ ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కారణంగా కాలుష్యం కాటుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆర్.ఆర్.వెంకటాపురంలో గ్యాస్ లీకేజ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం విశాఖలోని స్థానిక తెదేపా నేతలతో భేటీ కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతిలోని తన నివాసానికి బయలుదేరుతారు. మొత్తం మీద దాదాపు రెండు నెలల అనంతరం చంద్రబాబు తిరిగి ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధమవుతుండడంతో ఎపీ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.













