దానికోసం ఇప్పటి నుంచే కుట్రలు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటరు వెరిఫికేషన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఓటరు జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని, దానికోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందన్నారు. ఓటరు వెరిఫికేషన్ కార్యాక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి అందజేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు.
చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము కోరామని తెలిపారు. వైసీపీ దొంగ ఓట్లతో అక్రమాలకు పాల్పడుతూ, ఆ బురదను తిరిగి టీడీపీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటరు వెరిఫికేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చ న్నారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అధికారినీ వదిలేది లేదని అన్నారు.













