సీఈవోను కలవడం చరిత్రలో మొదటిసారి : చంద్రబాబు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ముఖ్యమంత్రి కలవడం ఇది తొలిసారి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఈవో ద్వివేదిని కలిసిన చంద్రబాబు ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను ద్వివేదికి చంద్రబాబు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా పట్టించుకోలేదని ఎన్నికల కమిషన్‌పై మండిపడ్డారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈసీని కోరామని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో ఓట్లను కౌంట్ చేయడానికి 6 రోజుల పడుతుందని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసీపై మండిపడ్డారు.
డేటా చోరీ కేసులో ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. టీడీపీ నేతలపై ఏకపక్షంగా ఐటీ దాడులు చేశారని, వైసీపీలో అవినీతిపరులు లేరా? ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని అన్నారు. టీడీపీ అభ్యర్థులు, నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందని, ప్రతిపక్ష నాయకుడి నిరాధారణ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.













