వారికి పార్టీ శాశ్వతంగా రుణపడి ఉంటుంది : చంద్రబాబు
వైసీపీ పాలనలో వెనుకబడిన వర్గాలు ( బీసీలు) సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. బీసీలకు సామాజికంగా, రాజకీయంగా చేయూత అందించిన పార్టీ తెలుగుదేశమేనని తెలిపారు. కుమారుడు చనిపోయి బాధలో ఉన్న కుటుంబానికి పరిహారంలో వాటా అడిగిన వ్యక్తి మంత్రి అంబటి రాంబాబు అని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం సహా మృతుడి కుమార్తెను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నెముక. బీసీలకు 24 శాతం రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ నిర్ణయంతో బీసీ వర్గాల నుంచి ఎంతోమంది నేతలుగా ఎదిగారు. సమర్థ నాయకత్వం వచ్చింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలోనే ఆదరణ పథకాన్ని అమలు చేశాం. బీసీ కులవృత్తులకు ప్రోత్సాహకాలు అందించాం. టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత బీసీల స్థితిగతులను బేరీజు వేసుకోవాలి. బీసీలు లేకపోతే టీడీపీ లేదు. వారికి పార్టీ శాశ్వతంగా రుణపడి ఉంటుంది అని అన్నారు.













