రూ.40 కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ : చంద్రబాబు
వైఎస్ వివేకా హత్య సంబంధించి రూ.40 కోట్ల సుపారీ, అడ్వాన్స్‌గా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఎంపీలతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజీల్ ధరలపై జగన్ ప్రభుత్వం పన్నులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు వంటి ఆంశాలు పార్లమెంట్లో లేవనెత్తాలని అన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ సరఫరా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని తీర్మానించారు.
వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడటంపై ప్రశ్నించాలన్నారు. దేశానికి అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయొద్దని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు, ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈఏపీ నిధుల దారి మళ్లింపుపై ప్రశ్శించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని పేర్కొన్నారు.













