త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ముస్లిం, మైనార్టీలతో పాటు బలహీన వర్గాలకు మంత్రి వర్గంలో చోటు ఖాయమైపోయిందా? పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారికి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అన్న ప్రశ్నలకు టీడీపీ శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న సంకేతాలతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం తక్కువగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణపై త్వరలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరందుకుంది.
ఇటీవల మంత్రి పదవులకు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలను ముస్లిం, మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేసే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసి వివిధ వర్గాలను సంతృప్తి పరచాలన్నది ముఖ్యమంత్రి అభిమతంగా అంచనా వేస్తున్నారు. ఎన్నిలకు ముందు ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.













